: నా రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి కాకుండా ఇంకెవరి గురించి మాట్లాడాలి?: శతృఘ్న సిన్హా


పార్లమెంటు సభ్యుడు, బీజేపీ సేత శతృఘ్న సిన్హా బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను కలవడం చర్చనీయాంశం అయింది. దీనిపై శతృఘ్న సిన్హా మాట్లాడుతూ... తాను నితీశ్ ను కలవడంలో రాజకీయకోణం ఏమీ లేదని స్పష్టం చేశారు. సీఎంతో తన భేటీ కారణంగా బీజేపీకి ఎలాంటి నష్టంలేదని అన్నారు. మర్యాదపూర్వకంగానే ఆయనను కలిశానని, రాష్ట్రానికి సంరక్షకుడిగా ఆయనను భావిస్తానని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి గురించి, ముఖ్యంగా తన పాట్నాసాహిబ్ నియోజకవర్గం గురించి సీఎంతో చర్చించానని సిన్హా వివరించారు. ఇటీవల నితీశ్ పై తరచూ ప్రశంసల జల్లు కురిపిస్తుండడాన్ని మీడియా ప్రశ్నించగా, "నేను బీహార్ కు చెందినవాడిని. నా రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి కాకుండా మరెవ్వరి గురించి మాట్లాడాలి?" అని శతృఘ్న సిన్హా తిరిగి ప్రశ్నించారు. ఆయనతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, ఆయనను కలవడం ఇదే తొలిసారి కాదని స్పష్టం చేశారు. అన్నింటికీ మించి ఇద్దరం మంచి మిత్రులమన్న సంగతి తెలిసిన విషయమేనంటూ వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జేడీయూ, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఈ కారణంగానే సిన్హా-నితీశ్ భేటీని జాతీయ మీడియా ప్రత్యేకంగా చూస్తోంది.

  • Loading...

More Telugu News