: పుష్కరాలపై 'కాకి లెక్కలు'!
గోదావరి పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసిన యాత్రికుల సంఖ్య విషయంలో తెలుగు రాష్ట్రాలు కాకిలెక్కలు చెబుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 4,81,41,069 మంది స్నానాలు చేశారని చంద్రబాబు సర్కారు ప్రకటిస్తే; తెలంగాణలో 6.40 కోట్ల మంది స్నానాలు చేశారని తెలంగాణ సర్కారు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు ఇంతమంది స్నానాలు చేశారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి తెలంగాణలో సుమారు 3.70 కోట్ల మంది ప్రజలున్నారు. వీరిలో దాదాపు 12 శాతం మంది ముస్లింలు, మరో 10 శాతం వరకూ క్రిస్టియన్లు ఉన్నారు. వీరిని తొలగిస్తే, దాదాపు 3 కోట్ల మంది హిందువుల్లో ఎంత మంది పుష్కరాలకు వెళ్లి స్నానాలు చేశారన్న ప్రశ్న ఉదయిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా 6.40 కోట్ల మంది స్నానాలు చేశారంటే నమ్మశక్యంగా లేదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి గోదావరి పుష్కరాలకు తెలంగాణలోని ఘాట్లకు వచ్చిన వారి సంఖ్య 10 లక్షలకు మించదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారు పుష్కర స్నానాల విషయంలో తప్పుడు లెక్కలు చెప్పిందని ఓ టీవీ చానల్ చర్చలో పాల్గొన్న పలు పార్టీల నేతలు తెలిపారు. మరో వైపు ఏపీ లెక్కలు సైతం అలాగే ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.