: రిషికేశ్వరి కేసులో సాక్ష్యాలు తారుమారు... అందుకే సెలవులు: వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపణ
గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో కలకలం రేపిన బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన రోజా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ కేబినెట్ లో ముగ్గురు మహిళా మంత్రులున్నా, మహిళా అధికారిపై చేయి చేసుకున్న మగాళ్లు దర్జాగా తిరుగుతున్నారని ఆమె అన్నారు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భూములు లాక్కునే విషయంపై ఉన్న ఆసక్తి, రిషికేశ్వరి కేసు దర్యాప్తుపై లేదన్నారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత వర్సిటీకి మంత్రి చుట్టపుచూపుగా మాత్రమే వెళ్లారన్నారు. మంత్రికి ఆకాశయానంపై ఉన్న ఆసక్తి విద్యార్థుల సమస్యలపై లేదని ఆరోపించారు. రిషికేశ్వరి తల్లిదండ్రులు చెబుతున్న విషయాల ఆధారంగా నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.