: స్టేట్ మారగానే బంపర్ ఆఫర్ కొట్టేసిన సర్ఫరాజ్ ఖాన్
ముంబై క్రికెట్ అసోసియేషన్ ను వీడగానే వర్ధమాన క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ఆడేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్న సర్ఫరాజ్, ప్రొఫెషనల్ మేనేజ్ మెంట్ గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం అతని కమర్షియల్స్ వ్యవహారాలను (వ్యక్తిగత స్పాన్సర్ షిప్స్, ఎండార్స్ మెంట్లు, ఇతర ఒప్పందాలు) పీఎంజీ పర్యవేక్షించనుంది. ఇందుకుగాను సర్ఫరాజ్ కు పీఎంజీ 2 కోట్ల రూపాయలు చెల్లించనుంది. ఈ సందర్భంగా పీఎంజీ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మెల్ రోయ్ డిసౌజా మాట్లాడుతూ, సర్ఫరాజ్ ఖాన్ మరింత ఏకాగ్రతతో ఆడేందుకు సహకరిస్తామని అన్నారు. అతని ప్రతిభను గుర్తించి తామీ ఒప్పందం చేసుకున్నామని, తమ మధ్య అనుబంధం సుదీర్ఘకాలం కొనసాగుతుందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, సర్ఫరాజ్ ఖాన్ అండర్ 19 జట్టుకు ఆడడం ద్వారా సత్తా చాటుకోగా, ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.