: వీళ్ల హెల్ప్ మర్చిపోలేను... నాన్నా! వీళ్లకొక్కసారి థ్యాంక్స్ చెప్పండి: సూసైడ్ నోట్ లో రిషికేశ్వరి
ఏపీలోని నాగార్జున యూనివర్శిటీలో బీటెక్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటన ఇటీవల సంచలనం సృష్టించింది. రోజులు గడిచేకొద్దీ ఈ వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా, రిషికేశ్వరి సూసైడ్ నోట్ లో వివరాలు వెల్లడయ్యాయి. చనిపోయే ముందు ఆమె ఎంత వేదన అనుభవించిందో ఆ లేఖ చెబుతోంది. హాయిగా నవ్వడం తనకిష్టమని, కానీ, వర్శిటీలో చోటుచేసుకున్న పరిణామాలు నవ్వును దూరం చేశాయని లేఖలో రిషికేశ్వరి పేర్కొంది. "చదువు కోసం వరంగల్ నుంచి ఇక్కడికి వస్తే సీనియర్లు నన్ను ప్రేమలోకి దించేందుకు ప్రయత్నించారు. వారికి లొంగకపోయేసరికి పుకార్లు పుట్టించారు. ఆ పుకార్లు వింటే ఏడుపు వచ్చేది. నాకిష్టమైన నాన్నకు కూడా ఈ విషయాలు చెప్పలేకపోయాను. ఆయన దగ్గర నాకు దాపరికం లేదు. కానీ, ఆయనకు కూడా చెప్పలేనంత దారుణమైన విషయాలవి. ఆ బాధను దాచుకోలేక ఎంత యాతన అనుభవించానో! తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమగా పెంచకూడదు. అలా ప్రేమానురాగాల మధ్య పెరిగిన పిల్లలు బయటికి వెళితే ఎన్ని కష్టాలు ఎదుర్కొంటారో ఈ యూనివర్శిటీలో నాకు అవగతమైంది. నాకోసం ఏడ్వొద్దు నాన్నా! అమ్మా... నువ్వు జాగ్రత్త! నా అవయవాలు బాగుంటే దానం చేసేందుకు ప్రయత్నించండి. నాన్నా... ఓ విషయం! మా సీనియర్లలో దీప, అవినాశ్, లావణ్య, ప్రసాద్... వాళ్లు నాకు చేసిన సాయం మర్చిపోలేను. వాళ్లకొక్కసారి థ్యాంక్స్ చెప్పండి. చాలా మంచివాళ్లు నాన్నా వాళ్లు" అంటూ రిషికేశ్వరి లేఖలో తన హృదయ వేదనను వివరించింది. ఇక చివరగా.... తన ఈ పరిస్థితికి కారణమైన వాళ్లెవరో తెలుసని, వాళ్లు తమ తప్పు తెలుసుకుని ఇంకెవరి జోలికీ వెళ్లకుండా ఉంటే చాలని ఆమె పేర్కొంది.