: చనిపోయిందనుకున్న మహిళ లేచి కూర్చుంది, కానీ...!
చనిపోయారనుకున్న వ్యక్తులు లేచి కూర్చుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఘటనలు తెలిసిందే. ఇది కూడా అలాంటిదే కానీ, చివరికి విషాదం తప్పలేదు. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. 65 ఏళ్ల గోమతి అనే మహిళ బుధవారం నాడు చనిపోయింది. ఆమె చనిపోయిందన్న విషయం తెలుసుకుని ఎక్కడెక్కడో ఉన్న బంధువులందరూ వచ్చారు. ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇంతలోనే, "నేను బతికున్నాను, నేను బతికున్నాను" అంటూ ఆమె అరుపులు వినబడ్డాయి. దాంతో, ఆమెకు చుట్టిన వస్త్రాలను కుటుంబ సభ్యులు విప్పదీశారు. గట్టిగా ఊపిరిపీల్చుకున్న గోమతి వారిచ్చిన మంచినీళ్లు తాగింది. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడింది. చనిపోయిందనుకున్న వ్యక్తి బతికడంతో ఆ కుటుంబంలో సంతోషం నెలకొంది. కానీ, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఓ గంట తర్వాత గోమతి ఈ లోకాన్ని నిజంగానే విడిచింది. మళ్లీ కళ్లు తెరుస్తుందేమోనని ఆశించిన ఆమె కుటుంబ సభ్యులకు తీవ్ర నిరాశ తప్పలేదు. మూసిన కళ్లు అలానే ఉండిపోయాయి.