: బాబు తూతూమంత్రపు పనులు చేస్తూ చంకలు గుద్దుకుంటున్నారు: చిరంజీవి ఎద్దేవా
ఎన్నికలకు ముందు తానిచ్చిన అన్ని హామీలనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుంగలో తొక్కారని కేంద్ర మాజీ మంత్రి, నటుడు చిరంజీవి ఆరోపించారు. ఈ ఉదయం అనంతపురం జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన బాబు, రూ. 80 వేల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేయాల్సింది, కేవలం రూ. 7 వేల కోట్లతో సరిపెట్టి తూతూమంత్రంగా పనిచేస్తూ చంకలు గుద్దుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. బ్యాంకు నుంచి లక్షన్నర రుణం తీసుకున్న ఓ రైతుకు రుణమాఫీలో భాగంగా కేవలం రూ. 8 వేలు దక్కిందని, ఇదేనా రైతులకు మీరు చేసే మేలు? అని ప్రశ్నించారు. విభజన సమయంలో తామిచ్చిన హామీలను, విభజన చట్టాన్ని అమలు చేయడంలో ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని తాను నమ్మకంగా చెప్పగలనని అన్నారు.