: బాహుబలి నుంచి రోబో వరకూ... ఆరు రూ. 100 కోట్ల చిత్రాల వెనుక ఏకైక వ్యక్తి!
బాహుబలి, రోబో, ఐ-మనోహరుడు, లింగా, కత్తి, తుపాకీ... ఈ చిత్రాలకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా? అన్ని రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రాలే. దక్షిణాది నుంచి అరుదైన ఘనతను సాధించి విజయం సాధించిన సినిమాలివి. వీటిల్లో నిర్మాతలు వేరు, దర్శకులు వేరు, నటీనటులు వేరు. అయినప్పటికీ, వీటన్నింటి నిర్మాణంలో భాగం పంచుకున్న వ్యక్తి ఒకరున్నారు. ఆయనే మదన్ కార్కే. ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్ లాండ్ లో డాక్టరేటు పొందిన మదన్ రోబోటిక్స్ నిష్ణాతుడు. పాటలు, డైలాగులు, నవలలూ రాయగలడు. బాహుబలిలో అందరినీ మెప్పించిన 'కిలికి' భాష సృష్టికర్త కూడా ఈయనే. శంకర్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ఎందిరన్ (తెలుగులో రోబో) చిత్రానికి తొలిసారిగా పనిచేశాడు. 'ఇరుంబిలీ ఒరు ఇరుదయ్యం' పాట రాశాడు. రోబో తయారీ, గ్రాఫిక్స్ విషయాల్లో శంకర్ కు సహకరించి దగ్గరయ్యాడు. ఆపై వెనుదిరిగి చూడలేదు. విజయ్ నటించిన తుపాకీ చిత్రంలో 'గూగుల్ గూగుల్' వంటి సూపర్ హిట్ సాంగ్ రాశాడు. లింగాలో ఏఆర్ రెహమాన్ తో కలసి పనిచేశాడు. 'మోనా మోనా... గాసోలినా' పాట రాశాడు. ఐ సినిమా కోసం శంకర్ తో తిరిగి జతకట్టి 'ఐలా ఐలా' పాటను రాయడంతో పాటు పలు విభాగాల్లో తనవంతు సహకారాన్ని అందించాడు. వరుసగా తాను పనిచేసిన ఆరు చిత్రాలూ విజయం సాధించడం, అన్నీ రూ. 100 కోట్ల క్లబ్ లో ఉండడంతో, ఇప్పుడు మదన్ కార్కే ఆనందానికి అవధుల్లేవు. ఆల్ ది బెస్ట్!