: సీతా... అవగాహన పెంచుకో!: రాజ్యసభలో అరుణ్ జైట్లీ ఘాటు వ్యాఖ్యలు
రాజ్యసభ సమావేశాల్లో భాగంగా నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఎప్పుడూ శాంతమూర్తిలా కనిపించే జైట్లీ గడచిన మూడు రోజులుగా విపక్షాల విమర్శల జడివాన నేపథ్యంలో ఒకింత ఆగ్రహావేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్నటి సమావేశాల్లో భాగంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై ఆయన విరుచుకుపడ్డారు. ‘‘సీతా... పార్లమెంటు నిబంధనలపై అవగాహన పెంచుకో. నీ నిరక్షరాస్యతతో నిబంధనలను వక్రీకరిస్తే చెల్లదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభాధ్యక్షుడికి తానిచ్చిన నోటీసు కాపీ ఆర్థిక మంత్రికి ఎలా చేరిందని ప్రశ్నించిన సీతారాం ఏచూరిపై విరుచుకుపడిన సందర్భంగా జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. జైట్లీ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఏచూరి, మంత్రిపై చర్యలు తీసుకోవాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ను డిమాండ్ చేశారు.