: బీసీ సీఎంనే తొలగించమంటావా?... వీహెచ్ కు ఝలకిచ్చిన మోదీ!
రాజ్యసభ సమావేశాల్లో భాగంగా నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావుకు ఝలకిచ్చారు. ‘‘బీసీ సీఎంనే తొలగించమంటావా?’’ అన్న మోదీ ప్రశ్నకు వీహెచ్ నోట మాట రాలేదట. వ్యాపం, లలిత్ గేట్ కుంభకోణాలపై ప్రతిపక్షాలు మూడు రోజుల పాటు పార్లమెంటు ఉభయసభలను స్తంభింపజేశాయి. ఈ సందర్భంగా నిన్న రాజ్యసభకు వచ్చిన మోదీ, విపక్ష సభ్యులతో కరచాలనం చేస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ తన సీటు వైపు సాగుతున్నారు. ఆ సమయంలో వీహెచ్ చేతిలో వ్యాపం స్కాంపై ప్లకార్డు మోదీ కంటబడింది. దీంతో నేరుగా ఆయన వద్దకెళ్లిన నరేంద్ర మోదీ ‘‘ఏ క్యాహై హన్మంతరావ్, బీసీ హోకే బీసీ సీఎంకో నికాల్ నా చాహతాహై క్యా? (ఇదేందీ హన్మంతరావ్! బీసీవై ఉండి బీసీ సీఎంను తీసేయమంటావా?)’’ అని ప్రశ్నించారు. దీంతో చేసేది లేక మిగిలిన ఎంపీలతో పాటు వీహెచ్ కూడా బిగ్గరగా నవ్వడం మినహా ఎదురు సమాధానం ఇవ్వలేకపోయారు.