: తల్లి రుణం తీర్చుకుంటున్నానంటూ రాజధాని కోసం నగలిచ్చేసిన ఎన్నారై


నవ్యాంధ్ర రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ అందుకున్న ఏపీ సర్కారు ఇప్పుడు నిధుల గురించి ఆలోచిస్తోంది. రాజధాని నిర్మాణం అంటే ఆషామాషీ వ్యవహారం కాదన్న విషయం సీఎం చంద్రబాబుకు తెలియందికాదు. అమరావతి ఆవిష్కరణలో ప్రజలకూ భాగస్వామ్యం ఉండాలని ఆయన పరితపిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని నిర్మాణం కోసం విరాళాలు వస్తున్నాయి. తాజాగా, శ్రీలక్ష్మి అనే ఎన్నారై తన బంగారు నగలను రాజధాని కోసం విరాళంగా ఇచ్చేశారు. సీఎం చంద్రబాబును ఆమె గురువారం రాజమండ్రిలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఏపీకి చెందిన చాలామంది విదేశాల్లో ఉన్నతస్థాయిలో ఉన్నారని, అలాంటి వారందరికీ ఇప్పుడు తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని అన్నారు. రాజధాని కోసం ఎన్నారైలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అద్భుతమైన రీతిలో నిర్మించాలని శ్రీలక్ష్మి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అన్నట్టు... శ్రీలక్ష్మి సింగపూర్ లో ఉంటున్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి సహకరిస్తోంది సింగపూరేనన్నది తెలిసిన విషయమే.

  • Loading...

More Telugu News