: ఈ యూనివర్శిటీ ఎంతో ప్రత్యేకం!
అభిమన్యుడు తల్లి సుభద్ర గర్భంలో ఉండగానే పద్మవ్యూహం గురించి విన్నాడని మహాభారతంలో చదువుకున్నాం. తల్లి గర్భంలో ఉన్న పిండ రూప శిశువుకు బయటి మాటలు ఎలా వినిపిస్తాయని కొందరు సందేహపడినా, అది వాస్తవమేనంటున్నాయి మధ్యప్రదేశ్ లోని అటల్ బిహారీ వాజ్ పేయి హిందీ యూనివర్శిటీ వర్గాలు. అంతేగాదు, గర్భస్థ శిశువులకు మాటలు నేర్పేందుకు వర్శిటీలో ప్రత్యేకమైన కోర్సును ప్రవేశపెట్టారు. ఆధునిక కాలంలో పలు పరిశోధనలు గర్భాశయంలో ఉండగానే తల్లి మాటలను శిశువులు ఆలకిస్తారని పేర్కొనడం ఈ వర్శిటీ నిర్ణయానికి బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలోనే వర్శిటీలో 'గర్భ్ సంస్కార్ తపోవన్' కేంద్ర పేరిట గతేడాది ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కోర్సులో భాగంగా తల్లులకు యోగా సాధన, సంగీత శ్రవణం తదితర అంశాల్లో కార్యాచరణ ఉంటుంది. అటుపై ఆ తల్లులు తమ గర్భంలో ఉన్న శిశువులతో సంభాషించాల్సి ఉంటుంది. పొట్టపై చేతులు ఉంచడం ద్వారా బిడ్డతో మాట్లాడేందుకు ప్రయత్నించమని శిక్షకులు చెబుతారు. వారానికి కనీసం రెండు సార్లు లెక్కల చిక్కుముడులు విప్పి చెప్పమని అడుగుతామని, దీని వల్ల పుట్టబోయే బిడ్డ మెదడు చురుకుగా తయారవుతుందని శిక్షకురాలు బబితా సోలంకి చెప్పారు. అలాగే భవిష్యత్తులో తమ బిడ్డ ఏ వృత్తిలో ప్రవేశించాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించిన విషయాలు మాట్లాడమని శిక్షకులు మహిళలను కోరతారు. ఈ శిక్షణతో ఫలితం ఉంటుందా? అన్న ప్రశ్నకు బబితా సోలంకి జవాబిస్తూ... ఇక్కడ శిక్షణ తీసుకున్న నలుగురు మహిళలు శిశువులకు జన్మనిచ్చారని, ఆ శిశువులు మిగతావారికంటే భిన్నంగా స్పందిస్తున్నారని, చాలా చురుగ్గా ఉన్నారని తెలిపారు.