: పార్టీ ఫిరాయింపులకు నేను వ్యతిరేకం... ఆ చట్టంలోనే లోపం ఉంది: డీఎస్
తెలంగాణలో కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపులపై టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఓ పార్టీలో గెలిచిన వ్యక్తి మరో పార్టీలో చేరడం బాధాకరమేనన్నారు. అయితే పార్టీ ఫిరాయింపులకు మొదటి నుంచీ తాను వ్యతిరేకమని, అసలు పార్టీ ఫిరాయింపుల చట్టంలోనే లోపం ఉందన్నారు. హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద డీఎస్ ఈరోజు మీడియాతో మాట్లాడారు. నిన్న సీఎం కలిశాక మీడియాతో మాట్లాడే అవకాశం రాలేదన్నారు. ప్రతిపక్షాల్లో పాజిటివ్ దృక్పథం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. 1990 నుంచే తెలంగాణపై వివక్ష కొనసాగిందని, తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక వేదికలపై తాను తెలంగాణ వాణిని వినిపించానని చెప్పారు. ఇక టీఆర్ఎస్ పార్టీలో చేరిన తాను కేబినెట్ పదవి కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిందని, వాటిలో మంచిచెడులున్నాయని అన్నారు. ప్రాజెక్టుల్లో మార్పులు చేర్పులను ప్రజలకు లాభామా? నష్టమా? అన్న కోణంలో చూడాలన్నారు. ఇద్దరు సీఎంలు పరస్పర సహకారంతో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.