: 'సూపర్ 30' విద్యార్థిని 'నిధి ఝా'పై ఫ్రెంచ్ చిత్రం
ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు ఐఐటీలో సీట్ కొట్టడమే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. అందులో సీట్ సాధిస్తే గొప్ప భవిష్యత్తు, మంచి జీతం ఉంటుందని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఆ వైపుగా ఎంకరేజ్ చేస్తుంటారు. అయితే, మంచి కోచింగ్ తీసుకుంటే కానీ, ఐఐటీని అందుకోవడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో, పేదలకు ఐఐటీ విద్య అందని ద్రాక్షలాగే మిగిలింది. ఈ క్రమంలో, పాట్నాలో ఆనంద్ కుమార్ స్థాపించిన 'సూపర్ 30' సంచలనాలు రేపుతోంది. ఏటా 30 మంది పేద విద్యార్థులకు ఆయన ఐఐటీ కోచింగ్ ఇస్తున్నారు. ఆయన కోచింగ్ లో ఎంతో మంది పేదలు తమ ఐఐటీ స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. అలాంటి విద్యార్థుల్లో ఒకరే నిధి ఝా. సాధారణ ఆటో డ్రైవర్ కూతురైన నిధి 2014లో ఐఐటీలో సీటు సాధించింది. తాజాగా, నిధి జీవితం ఆధారంగా ఫ్రెంచ్ దర్శకుడు పాస్కల్ ప్లిన్సన్ 'ది బిగ్ డే' అనే చిత్రాన్ని రూపొందించారు. ఆర్థికంగా ఎన్నో సమస్యలున్నా, ఎంతో కష్టపడి ఐఐటీలో అడుగుపెట్టిన నిధి చరిత్రను ఈ సినిమాలో చూపించారు. వచ్చే నెల ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రివ్యూకు నిధితో పాటు, తనకు కూడా ఆహ్వానం అందిందని సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ తెలిపారు.