: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది: ఎమ్మెల్యే రోజా
ఏపీ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆరోపణలు కొనసాగుతున్నాయి. నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కి బలైన విద్యార్థిని ఘటనలో ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇక తహశీల్దారు వనజాక్షి కేసుతో మహిళలపై గౌరవం లేదని కూడా తేలిపోయిందని మండిపడ్డారు. వనజాక్షిపై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కేబినెట్ మీటింగ్ లో క్లీన్ చిట్ ఇవ్వడం దుర్మార్గమన్నారు. చింతమనేనిని వెనకేసుకు రావడానికి తహశీల్దార్ ను బలిపశువు చేశారని ధ్వజమెత్తారు. ఓ మహిళా ఎమ్మార్వోకే రక్షణ లేదంటే ఇక రాష్ట్రంలో మహిళల పరిస్థితేమిటని రోజా ప్రశ్నించారు. ఈ ఘటనలన్నీ చూస్తుంటే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. వనజాక్షి తరపున రెవెన్యూ ఉద్యోగ సంఘాలు పోరాడాలని పిలుపునిచ్చారు. నిజాయతీగా పనిచేసిన అధికారులపై ప్రజలకోసం ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం కేసులు పెడుతోందని వ్యాఖ్యానించారు.