: ఐటీ కంపెనీల్లో 'వార్షిక పనితీరు సమీక్ష'కు మంగళం!
మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అత్యధిక నష్టాలు నమోదైన వేళ, యాపిల్ సంస్థ స్మార్ట్ ఫోన్ విక్రయాలు నిరాశాజనకంగా నమోదైన తరుణంలో, ప్రముఖ ఐటీ కంపెనీలు ఉద్యోగుల 'వార్షిక పనితీరు సమీక్ష'కు స్వస్తి చెప్పే దిశగా సాగుతున్నాయి. ఇప్పటికే యాక్సెంచర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెర్రీ నంతర్నే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఉద్యోగుల పనితీరుపై ప్రతి సంవత్సరమూ జరిపే సమీక్షలను నిలిపి వేస్తున్నట్టు 'వాషింగ్టన్ పోస్ట్' దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇదే సమయంలో ఉద్యోగులకు రివార్డులు ప్రకటించేందుకు మరింత పారదర్శకంగా ఉండేలా సరికొత్త విధానాన్ని అవలంబిస్తామని ప్రకటించారు. ఉద్యోగులకు కేటాయించిన అసైన్ మెంట్స్ నుంచి ఫీడ్ బ్యాక్ ను అందుకోనున్నామని తెలిపారు. యాక్సెంచర్ లో 3.3 లక్షల మంది ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తుండగా, వారిలో 1.5 లక్షల మంది భారత ఐటీ ఉద్యోగులే ఉన్నారు. ఇండియా ఉద్యోగులకు సంబంధించినంత వరకూ యాక్సెంచర్ తీసుకున్న నిర్ణయం శుభపరిణామమని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓ ఐటీ సంస్థ హెచ్ ఆర్ విభాగం మేనేజర్ వ్యాఖ్యానించారు. యాక్సెంచర్ దారిలోనే మిగతా కంపెనీలు నడవాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. కాగా, ఉద్యోగులకు వేతనాలు పెంచే విషయంలో సంప్రదాయ పద్ధతులకు మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలు స్వస్తి పలికాయి. పనితీరుపై సమీక్ష జరిపి ఉద్యోగులకు ర్యాంకులిచ్చే విధానాన్ని మార్చి వేశాయి. మరింకెన్ని కంపెనీలు ఇదే దారిలో నడుస్తాయో వేచి చూస్తేనే తెలుస్తుంది.