: 'తప్పిపోయినాడు బాబూ' అంటే వెతికి తెస్తున్నారు...పోలీసుల పనితీరు 'భేష్'!
'మా బాబు తప్పిపోయాడు. మాతో పాటు వచ్చిన పక్కింటి మహిళ ఎక్కడుందో ఏమో! మా వాళ్లు ఎక్కడున్నారో తెలియడం లేదు...' అంటూ పుష్కరాల కంట్రోల్ రూంలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. 'మా అమ్మా నాన్నా కనిపించడం లేద'ని ఏడుస్తూ కూర్చునే చిన్నారుల సంఖ్యా తక్కువేమీ కాదు. రాజమండ్రి పుష్కర ఘాట్ల వద్ద సెంట్రల్ కంట్రోల్ రూం నంబరు 12890 కాగా, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి తప్పిపోయిన వారి సంఖ్య కూడా 12890. ఇది కాకతాళీయమే అయినప్పటికీ, అమాయకత్వం, నిరక్షరాస్యత నిండిన వెనుకబడ్డ జిల్లా నుంచి పుణ్యాన్ని వెతుక్కుంటూ వచ్చిన వారిలోనే ఎక్కువ మంది తప్పిపోతున్నారు. జనసంద్రంలో ఒంటరిగా కనిపించిన వృద్ధులు, చిన్నారుల గురించి వివరాలు అడుగుతూ, వారిని కంట్రోల్ రూంకు చేర్చి, ఆపై వారిని తల్లిదండ్రులకు అప్పగించడం పోలీసులకు పుష్కరాల్లో అతిపెద్ద పనిగా ఉంటోంది. 9 రోజుల పుష్కరాలు పూర్తికాగా, మిస్సింగ్ ఫిర్యాదుల్లో ఒక్కటి కూడా అపరిష్కృతంగా లేదంటే, ఈ విషయంలో పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తప్పిపోయిన వారిని తిరిగి పట్టుకోవడంలో పోలీసులు చూపుతున్న చొరవను అందరూ 'భేష్' అని మెచ్చుకుంటున్నారు.