: సాధారణ మహిళలా కలసిపోయిన కేసీఆర్ భార్య శోభ!
కేసీఆర్ వదిన సుభద్ర దశ దినకర్మల నిమిత్తం సొంత ఊరు చింతమడకకు వచ్చిన ఆయన సతీమణి శోభ గ్రామం అంతా కలయదిరుగుతూ, సాధారణ మహిళలా కలసిపోయి, పేరు పేరునా అందరినీ పలకరించారు. తాము గతంలో ఉన్న ఇల్లు (ప్రస్తుతం చింతమడక ఎస్ బీహచ్ బ్యాంకు) చూసేందుకు వెళ్లి, అన్ని గదులూ తిరిగి, గతంలో ఏ గదిలో ఏం ఉండేదో గుర్తు చేసుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి అక్కడ మధ్యాహ్న భోజనాలు వండుతున్న లక్ష్మిని పేరు పెట్టి పిలిచి పలకరించారు. మరో మహిళ మంగమ్మ లేదా? అని అడిగి ఆమె గురించి ఆరా తీశారు. గ్రామంలోని ఏ వీధిలో ఎవరుంటున్నారని పాత స్నేహితురాళ్లను అడిగి తెలుసుకున్నారు. ఓ సాధారణ మహిళలా తనకు పరిచయమున్న, తెలిసిన వారందరితోనూ కలసిపోయి వారి యోగక్షేమాలు అడిగారు. కనిపించిన వృద్ధులను పేరు పేరునా పలకరించడంతో వారిలో సంతోషానికి హద్దులు లేకుండా పోయింది.