: మీరు ఎయిర్ టెల్ వినియోగదారులా?... జాగ్రత్తగా వుండండి!
మీరు ఎయిర్ టెల్ వినియోగదారులా? తస్మాత్ జాగ్రత్త...సరికొత్త మోసాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మెహదీపట్నంకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఖాదర్ వలీకి ఎయిర్ టెల్ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీకు 1100 రూపాయల ఎయిర్ టెల్ గిఫ్ట్ వచ్చిందని ఆ వ్యక్తి తెలిపాడు. తక్షణం దగ్గర్లోని ఎయిర్ టెల్ అవుట్ లెట్ కు వెళ్లి డబ్బులు తీసుకోవచ్చని, లేని పక్షంలో అంతే మొత్తానికి సరిపడా రీఛార్జ్ చేసుకోవచ్చని ఆ వ్యక్తి చెప్పాడు. ఈ ఆఫర్ కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉంటుందని, తక్షణం ఎయిర్ టెల్ అవుట్ లెట్ కు వెళ్లాలని తొందర పెట్టాడు. అక్కడ ఉద్యోగికి ఫోన్ ఇవ్వాలని, తాను మాట్లాడుతున్నంతసేపు 'అయిందా? అయిందా?' అంటూ అడగాలని, గిఫ్ట్ వచ్చినట్టు చెప్పవద్దని, అలా చెబితే ఆ గిఫ్టు అతను కాజేసే ప్రమాదం ఉందని ఆ వ్యక్తి హెచ్చరించాడు. దీంతో ఆయన ఫోన్ కట్ చేయకుండా, ఆ వ్యక్తి చెప్పినట్టే దగ్గర్లోని ఎయిర్ టెల్ ఆఫీస్ కు వెళ్లి, అక్కడి వ్యక్తికి ఫోన్ ఇచ్చాడు దీంతో ఖాదర్ వలీ అయిందా? అయిందా? అని అడుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఫోన్ లైన్లో ఉన్న వ్యక్తి పది నెంబర్లకు రీఛార్జ్ చేయించాడు. అందులో ఖారద్ వలీ నెంబర్ కు కూడా రెండు సార్లు 2000 చొప్పు రీఛార్జ్ చేయించడం విశేషం. కాల్ ముగిసిన అనంతరం రిటైలర్ ఖాదర్ వలీ చేతిలో 18 వేల రూపాయల బిల్లు పెట్టి, చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. వివాదం ముదరడంతో హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరింది. పోలీసుల జోక్యంతో 5000 వేల రూపాయలు ఖాదర్ వలీ దుకాణదారుకు చెల్లించాడు. మిగిలిన మొత్తం కోసం దుకాణదారు ఒత్తిడి చేస్తూ, బెదిరింపులకు దిగడంతో ఆయన సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దీంతో, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన సైబర్ క్రైం ఖాదర్ వలీకి ఫోన్ చేసింది రాజీవ్ అని గుర్తించారు, ఇతను గతంలో బేగంపేట ఎయిర్ టెల్ అవుట్ లెట్ లో పని చేశాడని నిర్ధారించారు. లక్నో ఎయిర్ టెల్ కార్యాలయం పేరిట పది మంది సభ్యులు గల ముఠా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా మహిళ ఆధ్వర్యంలో పని చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఫోన్ కాల్స్ పై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, రిటైలర్లు కూడా పెద్దమొత్తం రీఛార్జ్ చేసేటప్పుడు నిర్ధారించుకుని రీఛార్జ్ చేయాలని పోలీసులు సూచించారు.