: కాఫీ తెచ్చేలోపు రూ. 90 వేలతో ఉడాయించిన చుట్టాలు!
ఓ మహిళ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన బంధువులు, ఇంట్లో ఉంచిన రూ. 90 వేల నగదు చోరీ చేసి పారిపోయారు. ఈ ఘటన విజయవాడలోని కృష్ణలంకలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడి రాణీగారి తోటలో మహ్మద్ ముంతాజ్ అనే మహిళ తన ఇంటిని రూ. 90 వేలకు విక్రయించింది. ఆ డబ్బును లెక్కబెట్టుకుంటుండగా, ఆమెకు బంధువులైన నిజాముద్దీన్, అనీన దంపతులు వచ్చారు. ఆమె నగదున్న బ్యాగును అక్కడే ఉంచి అతిథులకు కాఫీ తెచ్చేందుకు లోపలికి వెళ్లి వచ్చే సరికి వారిద్దరూ లేరు. నగదున్న బ్యాగు కూడా లేదు. దీంతో అవాక్కయిన ఆమె నిజాముద్దీన్ దంపతులను నిలదీస్తే, తామే డబ్బు తీసుకున్నామని, తిరిగి ఇచ్చేస్తామని నమ్మబలికారు. ఈ ఘటన ఈనెల 3వ తేదీన జరుగగా, ఇంతవరకూ డబ్బివ్వక పోవడంతో ముంతాజ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.