: తెలంగాణ పుష్కర ఘాట్ లో మొసలి ప్రత్యక్షం... పరుగులు తీసిన భక్తులు
పవిత్ర గోదావరి పుష్కరాల్లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఘాట్లలో జల చరాలు కలకలం రేపుతున్నాయి. పుష్కరాల ప్రారంభం రోజున కరీంనగర్ జిల్లా ధర్మపురి పుష్కర ఘాట్ లో సీఎం కేసీఆర్ పుష్కరస్నానం చేస్తుండగా, ఆయనకు సమీపంలోనే పాము ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. భద్రతా సిబ్బంది అప్రమత్తతతో నాడు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత ఇదే జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి ఘాట్ లోనూ ఓ మొసలి కనిపించింది. తాజాగా కరీంనగర్ జిల్లాలోనే మరో ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మల్లాపూర్ మండలం పాతదామరాజుపల్లి వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ లో కొద్దిసేపటి క్రితం ఓ మొసలి ప్రత్యక్షమైంది. మొసలిని చూసి భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న జాలర్లు మొసలిని పట్టుకోవడంతో భక్తులు తిరిగి పుష్కర ఘాట్ లో స్నానాలు చేశారు.