: తిరుమలపై పుష్కరాల ఎఫెక్ట్...తగ్గిన భక్తుల రద్దీ
గోదావరి పుష్కరాలు తిరుమలలో భక్తుల రద్దీని తగ్గించేశాయి. అన్ని దారులూ గోదావరి వైపు వెళుతుండటంతో శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత కొద్ది రోజులుగా సాధారణంగా ఉన్న రద్దీ, నేడు మరింతగా తగ్గింది. కేవలం రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచివున్నారు. వీరికి గరిష్ఠంగా రెండు గంటల్లోపే దర్శనం పూర్తవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. రూ. 300 టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకుని తిరుమలకు వస్తున్న వారి సంఖ్య కూడా సాధారణ స్థాయితో పోలిస్తే తక్కువగా ఉంది. మధ్యాహ్నం తరువాత కేవలం గంట వ్యవధిలోనే దర్శనం పూర్తయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న తిరుమల స్థానికులు దేవదేవుని దర్శించుకునేందుకు వస్తున్నారు. సాధారణంగా తిరుపతి నుంచి తిరుమలకు నడిచే బస్సులనూ రద్దీ లేని కారణంగా ఆర్టీసీ అధికారులు తగ్గించారు.