: నెల రోజుల తర్వాత నేడు సెక్రటేరియట్ కు తెలంగాణ సీఎం కేసీఆర్!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సచివాలయానికి వచ్చి దాదాపుగా నెల రోజులవుతోంది. చివరిసారిగా గత నెల 23న ఆయన సెక్రటేరియట్ కు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన సచివాలయం ముఖమే చూడలేదు. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న కేసీఆర్, ఇటీవల పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఈ కారణంగా పలుమార్లు జిల్లా పర్యటనలను కూడా రద్దు చేసుకున్న కేసీఆర్ తన సొంత జిల్లా మెదక్ లోని ఫామ్ హౌస్ లో విడతలవారీగా సేదదీరారు. ఈ క్రమంలో హైదరాబాదు వచ్చినా, బేగంపేటలోని తన అధికారిక నివాసం నుంచే పరిపాలనను పర్యవేక్షించారు. తాజాగా నేటి మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ సెక్రటేరియట్ కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పలువురు పారిశ్రామికవేత్తలకు అనుమతులు మంజూరు చేస్తూ పత్రాలు అందజేయనున్నారు.