: ట్విట్టర్లో అమూల్ బాహుబలీయం!
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన జానపద దృశ్యకావ్యం బాహుబలి పలు భాషల్లో విడుదలై రికార్డు కలెక్షన్లతో ముందుకు దూసుకెళుతోంది. వివిధ రంగాల ప్రముఖులను సైతం ఈ సినిమా సమ్మోహితులను చేయడం విశేషం. పాలు, పాల ఉత్పత్తులకు పేరుగాంచిన అమూల్ సంస్థ ఈ సినిమా హిట్ నేపథ్యంలో ట్విట్టర్లో విలక్షణంగా స్పందించింది. యుద్ధరంగంలో ఉన్న బాహుబలికి ఓ సుందరాంగి అమూల్ బటర్ రాసిన బ్రెడ్ స్లైస్ ను అందిస్తుంది. అది రుచి చూసిన బాహుబలి 'ఆహా ఓహో' అంటుండగా, ఆ దృశ్యాన్ని భల్లాలదేవ పళ్లు కొరుకుతూ చూస్తూ ఉంటాడు. దీనికి 'బహుత్ బట్టర్లీ' అని క్యాప్షన్ పెట్టారు. అంతేగాదు, 'మాసివ్ హిట్' అంటూ ట్యాగ్ లైన్ కూడా తగిలించారు. ప్రస్తుతం బాహుబలి హవా వీస్తున్న నేపథ్యంలో, అమూల్ పోస్టుకు ట్విట్టర్లో విశేష స్పందన కనిపిస్తోంది.