: 47 మంది ఎంపీల అద్దె ఖర్చు 24 కోట్లు...మన ఎంపీల జీవన విధానం ఇది!


పార్లమెంటు సెంట్రల్ హాల్ క్యాంటీన్లో ప్రజా ప్రతినిధులకు అతి తక్కువ ధరకు మెరుగైన భోజన సదుపాయం కల్పించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎంపీల నివాస సౌకర్యంపై ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ దాఖలు చేసిన దరఖాస్తుకు కేంద్రం సమాధానం చెప్పింది. బీజేపీ అధికారం చేపట్టిన 14 నెలల కాలంలో స్టార్ హోటళ్లలో నివాసం ఉంటున్న 47 మంది ఎంపీలకు 24 కోట్ల రూపాయలు చెల్లించినట్టు తెలిపింది. ప్రభుత్వం అధికారం చేపట్టిన 30 రోజులలోపు పార్లమెంటుకు ఎన్నికైన ఎంపీలకు నివాస సౌకర్యం కల్పించాలి. లేని పక్షంలో ఎంపీ నివాసం ఉండే స్టార్ హోటల్, రిసార్ట్, గెస్ట్ హౌస్ దేనికైనా అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. 47 మంది ఎంపీల్లో 15 మందికి కేంద్రం క్వార్టర్లు కేటాయించింది. వాటిల్లో పది నివాసయోగ్యమైనవి కావంటూ ఎంపీలు లగ్జరీ హోటళ్లలో ఉంటున్నారు. మరో ఐదుగురికి కేటాయించిన క్వార్టర్లు నివాసయోగ్యంగా ఉన్నప్పటికీ, వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గెస్ట్ హౌస్ లు ఖాళీ చేయకపోవడం విశేషం. మాజీ ఎంపీలు పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన 14 రోజులలోపు క్వార్టర్ ఖాళీ చేయాల్సి ఉంటుంది. కానీ కొంత మంది ఆరునెలల వరకు వాటిల్లోనే ఉంటున్నారు. దీంతో ఎంపీలు స్టార్ హోటళ్లలో లగ్జరీ సూట్లలో నివాసం ఉంటున్నారు. దీంతో వారి నివాసానికైన ఖర్చు కేంద్రం భరిస్తోంది. ఈ రకంగా 47 మంది ఎంపీలకు చెందిన నివాసానికైన ఖర్చు 24 కోట్ల రూపాయలని కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News