: యుద్ధ విమానాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిన పాక్... మనం మాత్రం ఇంకా పరీక్షల వద్దే!
యుద్ధ విమానాలను తయారు చేసి వాటితో వ్యాపారం చేసే విషయంలో పాకిస్థాన్, భారత్ కంటే నాలుగడుగులు ముందే ఉంది. చైనా సహకారంతో పాక్ అభివృద్ధి చేసిన 'జెఎఫ్-17' యుద్ధ విమానాలు కావాలంటూ విదేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయి. ఇదే సమయంలో భారత్ స్వీయ పరిజ్ఞానంతో తయారు చేసిన ఎల్ సీఏ (లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్) తేజాస్ విమానాలు ఇంకా పరీక్షల దశలోనే ఉన్నాయి. ఈ విమానాలకు మరింత పవర్ ఫుల్ ఇంజన్ తోడైతేనే మెరుగైన పనితీరు ఉంటుందని భావిస్తున్న శాస్త్రవేత్తలు ఆ దిశగా ఇంజన్ల అభివృద్ధిలో నిమగ్నమయ్యారు. 2018-19 నాటికిగాని తేజాస్ మార్క్-2 విమానం పూర్తి స్థాయిలో సిద్ధం కాదని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. కాగా, ప్రస్తుతం ఐఏఎఫ్ వద్ద 35 ఫైటర్ స్క్వాడ్రన్స్ ఉన్నాయి. ఒకవేళ పాకిస్థాన్, చైనాల నుంచి ఒకేసారి ప్రమాదం ఏర్పడితే, కనీసం 44 స్క్వాడ్రన్స్ ఉంటేనే వారిని నిలువరించవచ్చు. తేజాస్ విమానాల అభివృద్ధికి ఇప్పటికే రూ. 55 వేల కోట్లను వెచ్చించిన సంగతి తెలిసిందే. రఫాలే, మిగ్ లతో పోలిస్తే ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం తేజాస్ విమానాల్లో మూడింట ఒక వంతు మాత్రమే ఉంటుంది. చైనాలోని లక్ష్యాల వద్దకు వెళ్లి బాంబులు విసిరి రావాలంటే వీటి వల్ల కాదు. ఇవి కేవలం 400 కి.మీ. రేంజ్ లో మాత్రమే దాడులు జరపగలుగుతాయి.