: పొన్నాలను విస్మరించిన టీ కాంగ్... ఆలస్యంగా పిలిచిన ఉత్తమ్ పై మాజీ చీఫ్ ఫైర్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ(టీ పీసీీసీ)కు నిన్నటిదాకా పొన్నాల లక్ష్మయ్యే దిక్కు. పార్టీ కష్టాల్లో ఉన్నా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా టీ పీసీసీ చీఫ్ బాధ్యతలను భుజాననేసుకున్న ఆయన కష్టాల కడలికి ఎదురీదారు. అయితే పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు టీ పీసీీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడయ్యారు. ఇక అప్పటి నుంచీ ఆయనకు అవమానాలు ఎదురవుతున్నాయి. పార్టీ కార్యక్రమాలకు ఆయనకు అంతగా ఆహ్వానం అందడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని గాంధీ భవన్ లో వరంగల్ పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికపై అత్యున్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ భేటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, వరంగల్ కు చెందిన పార్టీ నేతలు హాజరయ్యారు. అయితే వరంగల్ జిల్లాకే చెందిన పొన్నాలకు మాత్రం ఆహ్వానం అందలేదట. సమావేశం ప్రారంభమయ్యాక కాని జరిగిన పొరపాటును తెలుసుకోలేకపోయిన ఉత్తమ్, అక్కడి నుంచే పొన్నాలకు ఫోన్ చేశారు. 'ఏదో పొరపాటు జరిగిపోయింది, పెద్ద మనసు చేసుకుని సమావేశానికి రండి' అంటూ ఉత్తమ్ అనబోయారట. ఉత్తమ్ ఫోన్ రాగానే ఆగ్రహంతో ఊగిపోయిన పొన్నాల సమావేశానికి వచ్చేది లేదని తేల్చిచెప్పి ఫోన్ పెట్టేశారట.