: అత్యధికుల ప్రాణాలు హరిస్తున్నది ప్రకృతి విపత్తులు కాదట!
సునామీలు వస్తే సముద్ర తీరమంతా తుడిచిపెట్టుకుపోతుంది. ఇక భూకంపం వస్తే చెప్పనవసరమే లేదు. ఆకస్మిక వరదలు వచ్చినా అంతే. ఇవన్నీ భారీ సంఖ్యలో మానవుల ప్రాణాలను హరించేవే. అయితే, ఇంతకన్నా అత్యధికుల ప్రాణాలు తీస్తున్నది ఏంటో తెలుసా? మానవ తప్పిదాలు. ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) గణాంకాల ప్రకారం, 2014లో ప్రకృతి ఉత్పాతాలతో పోలిస్తే 15 రెట్లు అధికంగా మానవ తప్పిదాల వల్ల తనువు చాలించారు. రోడ్డు, రైలు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, క్షణికావేశం తదితర మానవ తప్పులు దాగుండే కారణాల వల్ల మొత్తం 3,16,828 మంది మరణించగా, వరదలు, భూకంపాలు తదితర ప్రకృతి విపత్తుల వల్ల మరణించింది 20 వేల మందేనని ఎన్సీఆర్బీ తెలిపింది. మానవ తప్పిదాల కారణంగా మరణించిన వారిలో 1.70 లక్షల మంది రోడ్డు ప్రమాదాల వల్లే మృతి చెందారని తెలిపింది. కాగా, ఎన్సీఆర్బీ తన గణాంకాల్లో 'అసహజ' మరణాలను తొలిసారిగా రెండు కేటగిరీలుగా విభజించింది. వీటిల్లో ఒకటి మానవ తప్పిదాల కారణంగా కలిగే మరణాలుగా, మరొకటి ఇతర కారణాలు అంటే గుండెపోటు, ప్రసవ మరణాలు, జంతు దాడులు తదితరాల కారణంగా కలిగే మరణాలుగా విడగొట్టింది. గడచిన 10 సంవత్సరాల కాలంలో యాక్సిడెంట్ మరణాలు 22 శాతం పెరిగాయని తెలిపింది.