: ఏపీ మంత్రుల ఆంగ్ల పరిజ్ఞానంతో చంద్రబాబుకు తలనొప్పులు!
ఆంధ్రప్రదేశ్ మంత్రులు, పార్టీ నేతల ఆంగ్ల పరిజ్ఞానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుండటంతో ఎవరూ కూడా ఇంగ్లీషు మీడియా చానళ్లలో జరిగే చర్చలకు హాజరు కారాదని ఆదేశించినట్టు తెలుస్తోంది. మంత్రుల వచ్చీరాని ఇంగ్లీషు బాబుకు అవమానకరంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని ఇంగ్లీషు మీడియాతో మాట్లాడేందుకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ను మాత్రమే అనుమతించినట్టు సమాచారం. వివిధ అంశాలపై పార్టీ విధానాలు, ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు తదితరాల విషయంలో ఆంగ్లంపై పరిజ్ఞానమున్న జయదేవ్ సమర్థవంతంగా వాణిని వినిపించగలరని బాబు భావిస్తున్నారు. గత వారంలో ఓ ఆంగ్ల చానల్ తో 29 మందిని బలిగొన్న పుష్కర తొక్కిసలాటపై మాట్లాడుతూ, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పీ నారాయణ సరైన రీతిలో ప్రభుత్వ వాదన వినిపించలేకపోయారని బాబు గమనించారు. భద్రతా ఏర్పాట్లలో లోపం వల్ల ప్రమాదం జరగలేదని చెప్పడంలో వారు విఫలమయ్యారు. అంతకుముందు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సైతం ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వచ్చీరాని ఇంగ్లీషులో మాట్లాడటం కూడా జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసేలా ఉందని భావిస్తూ, జయదేవ్ కు మాత్రమే ఆంగ్ల మీడియాతో మాట్లాడే బాధ్యతలు అప్పగించారని తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. మంచి ఇంగ్లీషు మాట్లాడే వారిని గుర్తించే వరకూ ఎవరూ కూడా చర్చా కార్యక్రమాల్లో పాల్గొనరాదని బాబు స్వయంగా చెప్పినట్టు ఓ మంత్రి సైతం స్పష్టం చేశారు.