: పాక్ క్రికెటర్లపై లంక అభిమానుల రాళ్ల దాడి... క్షమాపణలు చెప్పిన లంక బోర్డు
క్రికెట్ ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటుతోంది. నిన్నటిదాకా పాకిస్థాన్, భారత్ లలోనే ఈ తరహా పిచ్చి అభిమానులు ఉన్నారనుకుంటే, తాజాగా లంక అభిమానులు కూడా వీరికి జత కలిశారు. తమ దేశంలో పర్యటిస్తున్న పాకిస్థాన్ క్రికెటర్లు తమ జట్టును చీల్చిచెండాడుతున్న వైనాన్ని జీర్ణించుకోలేకపోయారు. పాక్ క్రికెటర్లపై రాళ్లతో విరుచుకుపడ్డారు. మొన్న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. లంక అభిమానుల దుందుడుకు చర్య కారణంగా మ్యాచ్ కొంతసేపు నిలిచిపోయింది. భద్రతా సిబ్బంది పరుగు పరుగున మైదానంలోకి వచ్చి ఆటగాళ్లకు రక్షణగా నిలిచారు. ఆ తర్వాత అతి కష్టం మీద మ్యాచ్ ను కొనసాగించారు. దీనిపై లంక క్రికెట్ బోర్డు విచారం వ్యక్తం చేసింది. పాక్ క్రికెటర్లకు క్షమాపణలు చెప్పింది.