: సిగ్గుతో తల కొట్టేసినట్లయింది... అమిత్ షాపై బీజేపీ నేత లెటర్ బాంబు!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతాయని భావిస్తున్న వేళ, ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు అమిత్ షాను ఉద్దేశించి రాసిన లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ బీజేపీ నేత శాంతకుమార్ అమిత్ షాకు లేఖ రాస్తూ, ఇటీవలి కాలంలో పార్టీని చుట్టిన వివాదాలు పరువు తీస్తున్నాయని అభిప్రాయపడ్డారు. రోజురోజుకూ పార్టీలో వివాదాలకు గురవుతున్నవారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. పార్టీలో అంతర్గత లోక్ పాల్ వ్యవస్థ ఏర్పాటు కావాల్సి వుందని, ఎథిక్స్ కమిటీ నియామకమూ జరగాలని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం పాలనలో ఉండగా జరిగిన వ్యాపమ్ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ, దీంతో మనమంతా సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. రాజస్థాన్, మహారాష్ట్రల్లో చెలరేగిన వివాదాలనూ గుర్తు చేసిన ఆయన, ఇవన్నీ విపక్షాలకు ప్రభుత్వానికి ఇరుకున పెట్టే ఆయుధాలుగా మారాయని అన్నారు. కాగా, వాజ్ పేయి నేతృత్వంలో బీజేపీ పాలన జరిగిన సమయంలో శాంతకుమార్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. జూలై 10న తాను రాసిన లేఖను నేడు ఆయన ఫేస్ బుక్ పేజీలో ఉంచారు. తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, తాను అమిత్ షాను ఉద్దేశించి రాసిన లేఖలో ప్రతి మాటకూ కట్టుబడి వున్నానని, ఇంతకన్నా చెప్పేదేమీ లేదని అన్నారు.