: డీడీ కిసాన్ తో కాంట్రాక్టూ లేదు... డబ్బులూ తీసుకోలేదు: అమితాబ్
దూరదర్శన్ కిసాన్ చానల్ కు ప్రచారం చేసిపెట్టేందుకు తాను రూ.6.1 కోట్లు తీసుకున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దూరదర్శన్ తో తనకు ఎలాంటి కాంట్రాక్టు లేదని, వారి నుంచి తాను డబ్బులు తీసుకున్నదీ లేదని అమితాబ్ ఆ ప్రకటనలో వివరించారు. అయితే, డీడీ కిసాన్ చానల్ కు ప్రచారం కోసం తాను లోవె లింటాస్ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీతో పనిచేశానని, ఈ విషయంలో తనకు, ప్రసారభారతికి మధ్య ఒప్పందం లేదని స్పష్టం చేశారు. కొన్ని అంశాలపై ప్రచారం కోసం తాను స్వచ్ఛందంగానే ముందుకు వస్తానని, అలాంటి వాటిలో డీడీ కిసాన్ చానల్ కూడా ఒకటని పేర్కొన్నారు.