: ఒక్క పైసా కూడా అడగకుండా మాస్టర్ ప్లాన్ ఇచ్చారు: చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో కలిసి రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... పుష్కరాలు జరుగుతున్న పవిత్ర సమయంలో సింగపూర్ బృందం నుంచి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తాము ఇప్పటివరకు సింగపూర్ బృందానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, అయినాగానీ, వారు ఏపీకి సాయం చేయాలన్న ఉద్దేశంతో చెప్పిన సమయానికి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చారని కొనియాడారు. 2014 డిసెంబర్ 8న ఎంవోయూ కుదిరిందని, అతి కొద్ది సమయంలోనే ప్లాన్ అందించారని ప్రశంసించారు. ఏపీ ప్రజల తరపున, ప్రభుత్వం తరపున సింగపూర్ ప్రధానికి, మంత్రి ఈశ్వరన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. దేశంలోనే ఉత్తమ నగరంగా అమరావతిని నిర్మిస్తామని, రాజధాని నిర్మాణంలో అందరి భాగస్వామ్యం ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఇటుకనైనా విరాళంగా ఇవ్వాలని, రాజధానిలో తమకూ భాగం ఉందని గర్వంగా అనుకోవాలని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు.