: బంగారం అమ్మకానికి సరైన సమయమిదే, భవిష్యత్తులో మరింతగా ధర తగ్గుతుందట!
మీ దగ్గర బంగారం బిస్కెట్ల రూపంలో ఉందా? లేకుంటే బంగారు నగలను అమ్మి ఆర్థిక కష్టాలు తీర్చుకోవాలని భావిస్తున్నారా? అయితే, వెంటనే లాకర్లలోని బంగారాన్ని బయటకు తీయండి. ఇప్పుడే బంగారాన్ని అమ్ముకోండి. భవిష్యత్తులో బంగారం ధర మరింతగా పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొద్ది కాలంగా ఒత్తిడి మధ్య కొనసాగుతూ వస్తున్న గోల్డ్ రేట్ నేడు మరింతగా దిగజారింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రితం ముగింపుతో పోలిస్తే ఔన్సు బంగారం ధర 4 శాతం తగ్గి 1,089.80 డాలర్లకు పడిపోయింది. ఇక ఇండియాలో ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం కుదేలైంది. ఆగస్టులో డెలివరీ అయ్యే కాంట్రాక్టులో బంగారం ధర రూ. 24,904కు చేరింది. ఇదే సమయంలో సెప్టెంబర్ లో డెలివరీ అయ్యే కిలో వెండి ధర రూ. 33,430కి పడిపోయింది. అమెరికాలో వడ్డీ రేట్లను పెంచుతూ యూఎస్ ఫెడ్ నిర్ణయం తీసుకుంటే బంగారం ధరలు మరింతగా తగ్గుతాయని, నష్టాన్ని నివారించుకునేందుకు బంగారం ట్రేడర్లు, స్టాకిస్టులు ఇప్పుడే అమ్మకాలు జరిపితే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఇండియాలో బంగారం ధర రూ. 20,500 వరకూ తగ్గే ప్రమాదముందని రీసెర్చ్ సంస్థ ఇండ్-రా సీనియర్ డైరెక్టర్ దీప్ ఎన్ ముఖర్జీ అంచనా వేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు ధర 900 డాలర్ల వరకూ పతనం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం అమలు ఆలస్యమైతే, బంగారం ధర రూ. 24 వేల వద్ద కొంతకాలం మద్దతును నిలుపుకోవచ్చని భావన.