: ముందడుగే... కీలక బిల్లులపై వెనక్కు తగ్గబోము, చర్చలకు సిద్ధం: మోదీ
భూసేకరణ వంటి ముఖ్యమైన బిల్లులపై తాము ముందడుగు వేస్తామని, విపక్షాల ఒత్తిడికి తలొగ్గి వెనుకంజ వేయబోమని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఉదయం అఖిల పక్ష పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన ప్రతి బిల్లుపైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. "అన్ని అంశాలనూ చర్చించేందుకు పార్లమెంట్ వేదికను వినియోగించుకోవాలి. సభా సమయాన్ని వృథా చేయవద్దు" అని అన్నారు. భూసేకరణ బిల్లుపై ముందుకు కదలాలని మోదీ సూచించారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పలు అంశాలపై, ఇటీవల వెలుగులోకి వచ్చిన కుంభకోణాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో పంకజ్ ముండే అంగన్వాడీ నిధుల కుంభకోణం, మధ్యప్రదేశ్ లో వ్యాపమ్ కుంభకోణం, లలిత్ గేట్, స్మృతీ ఇరానీ విద్యార్హతలు తదితర ఎన్నో అంశాలపై బీజేపీ సర్కారును ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ సహా విపక్షాలు సిద్ధమయ్యాయి. వీటన్నింటికీ దీటుగా సమాధానం ఇవ్వాలని అటు బీజేపీ సభ్యులు సైతం గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.