: పుష్కర భక్తుల కష్టాలు ఎన్నని చెప్పాలి? ఏమని చెప్పాలి?


గోదావరి పుష్కరాలకు సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలతో వస్తున్న యాత్రికులు తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నారు. ఉండేందుకు వసతి నుంచి, ఘాట్లకు వెళ్లి రావడానికి ఆటోలు, తిండీతిప్పలు ఆఖరికి మంచినీటికి సైతం అవస్థలు పడక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రాజమండ్రి వంటి రద్దీ ఎక్కువ ఉన్న చోట్ల ఇబ్బందులు వర్ణనాతీతం. సూర్యోదయాన్నే పుష్కర స్నానం చేసి మరింత పుణ్యం మూటగట్టుకోవాలని, ముందు రోజు వచ్చేవారు అత్యధిక కష్టాలను అనుభవిస్తున్నట్టు లెక్క. నగరంలో 300 వరకూ లాడ్జీలు ఉండగా, సాధారణ రోజుల్లో రూ. 500 వరకూ ఉండే అద్దె ఇప్పుడు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకూ పలుకుతోంది. అది కూడా 12 గంటలకు మాత్రమే. ఇక ఇంతటి డిమాండును గుర్తించిన గృహాల యజమానులు తమ ఇళ్లలో అద్దెలకు ఉంటున్న వారిని ఖాళీ చేయించి మరీ వాటిని రోజువారీ కిరాయికి ఇస్తున్నారు. రెండు, మూడు గదులున్న పోర్షన్ ను రోజుకు రూ. 5 వేల వరకూ అద్దెకు ఇస్తున్నారు. తాము మాత్రం తక్కువ తిన్నామా అనుకుంటూ, ఆటో వాలాలు చేతికందినంత పిండుకుంటున్నారు. రాజమండ్రిలో బస్టాండు నుంచి ఏ పుష్కర ఘాట్ కు వెళ్లాలన్నా గరిష్ఠంగా 5 కిలోమీటర్ల దూరం వెళితే చాలు. ఈ దూరానికి సాధారణ రోజుల్లో రూ. 50 వరకూ వసూలు చేసే ఆటోవాలాలు, పుష్కర సమయంలో రూ. 300 పిండుకుంటున్నారు. మరికొందరైతే ఒక్కొక్కరికి రూ. 100 వసూలు చేస్తున్నారు. రూ. 25 ఉండే 20 లీటర్ల మంచినీటి క్యాన్ ధర కూడా రూ. 100కు పెరిగింది. పండ్లు, కూరగాయల ధరలు సైతం చుక్కలను తాకుతున్నాయి. రూ. 60కి లభించే హోటలు భోజనం ధర రూ. 120కి చేరింది. పుష్కరాలకు వస్తున్న యాత్రికులను పిండుకోవడమే లక్ష్యంగా జరుగుతున్న దోపిడీపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News