: క్యాంటీన్ లో సబ్సిడీ ఫుడ్డు మాకెందుకు?... లోక్ సభ స్పీకర్ కు ఎంపీల లేఖలు!


పార్లమెంటు క్యాంటీన్ లో ఎంపీలకు నాణ్యమైన ఫుడ్డే దొరుకుతుంది. అంతేకాక దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన ఆహార పదార్థాలు కూడా అక్కడ దొరుకుతాయి. ఇటీవలే హైదరాబాదీ బిర్యానీ కూడా అక్కడ లభిస్తోంది. ఎంత నాణ్యమైన ఫుడ్డైనా, ఎంపీలకు సబ్సిడీ కిందే లభిస్తోంది. అది కూడా అక్కడ అమలవుతున్న తక్కువ ధరలు దేశంలో మరెక్కడా లేవట. నెలకు వేల రూపాయల మేర గౌరవ వేతనం పొందే ఎంపీలకు అంత తక్కువ ధరకు ఆహారాన్ని అందించాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఇటీవల పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘‘ఈ సబ్సిడీ ఫుడ్డు మాకవసరం లేదు, వెంటనే సాధారణ రేట్లను అమలు చేయండి’’ అంటూ కొంతమంది ఎంపీలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు లేఖలు రాశారు. ఒడిశాకు చెందిన వైజయంత్ జయ్ పండా తొలుత లేఖను స్పీకర్ కు రాశారు. ఆ తర్వాత మరికొంతమంది ఎంపీలు కూడా ఈ లేఖలు రాశారు. ఇక పార్లమెంట్ హౌజ్ కాంప్లెక్స్ ఫుడ్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్న తెలంగాణ ఎంపీ జితేందర్ రెడ్డికి కూడా ఈ తరహా లేఖలు అందాయట. మరి పార్లమెంటు క్యాంటీన్ లో సబ్సిడీ రేట్లను ఎప్పుడు ఎత్తేస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News