: గవర్నర్ గారూ... ఇప్పుడేమంటారు?: రేవంత్ సూటి ప్రశ్న
తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలను తప్పుదారి పట్టించారని తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా గవర్నర్ ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తలసాని రాజీనామా స్పీకర్ కార్యాలయానికి చేరలేదని వెల్లడైన పచ్చి నిజంపై నరసింహన్ తన స్పందన వెంటనే తెలియజేయాలని కోరారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్, కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి తప్పు చేస్తున్నట్టు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. తలసానిని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన సమయంలో గవర్నర్ కనీస నిబంధనలు పాటించలేదని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల ముందు టీఆర్ఎస్ నేతలు దోషులుగా నిలబడ్డారని విమర్శించారు. ఈ విషయంలో స్పీకర్ వ్యవహార శైలి సైతం తప్పుబట్టేదిగా ఉందని అన్నారు. ప్రభుత్వం మొండి వైఖరితో వెళితే, తాము కూడా అంతే దూకుడును ప్రదర్శిస్తామని, మొత్తం విషయాన్ని కోర్టుకు తీసుకెళ్తామని హెచ్చరించారు.