: సంచలనం... ఇండియాలో ప్రాజెక్టుల కోసం మంత్రులకు లంచాలిచ్చిన అమెరికన్ సంస్థ
భారత్ లో నీటి నిర్వహణ ప్రాజెక్టులను పొందేందుకు యూఎస్ కు చెందిన లూయిస్ బర్గర్ అనే సంస్థ లంచాలను ముట్టజెప్పింది. యూఎస్ న్యాయ విభాగం ఈ మేరకు కేసులు పెడితే, తాము తప్పు చేసినట్టు సంస్థ అంగీకరించింది. వివరాల్లోకి వెళితే, గోవా, గౌహతి ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు లూయిస్ బర్గర్ 9.76 లక్షల యూఎస్ డాలర్లు (సుమారు రూ. 6.2 కోట్లు) ఓ మంత్రికి లంచంగా ఇచ్చింది. ఈ విషయంలో సాక్ష్యాలను సేకరించిన అమెరికా న్యాయ శాఖ కేసులు పెట్టగా, శనివారం నాడు తప్పు ఒప్పుకున్న సంస్థ 17.1 మిలియన్ డాలర్లను జరిమానాగా చెల్లించేందుకు అంగీకరించింది. ఇండియాతో పాటు ఇండోనేషియా, వియత్నాం, కువైట్ ప్రాంతాలలోనూ కాంట్రాక్టులను పొందేందుకు ఈ కంపెనీ ముడుపులు చెల్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఇండియాలో ఏ మంత్రికి లంచాలు అందాయన్న విషయాన్ని మాత్రం అమెరికా వెల్లడించలేదు. లూయిస్ బర్గర్ తరపున భారత కార్యకలాపాలు పర్యవేక్షించి ఆపై ఉద్యోగాన్ని వీడిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ మెక్ క్లుంగ్ తో పాటు ఫిలిప్పైన్స్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ హిష్ పైనా న్యూజర్సీ కోర్టులో కేసులు దాఖలయ్యాయి. మొత్తం 11 పేజీల చార్జ్ షీటులో, భారత అధికారులకు ఇచ్చిన లంచాల వివరాలను సంస్థ తన డైరీలో రాసుకుందని పేర్కొంది. కేసు తదుపరి విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది. కాగా, గోవాలో మంచినీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ ప్రాజెక్టును భారత ప్రభుత్వం, జపాన్ సంయుక్తంగా చేపట్టగా దాన్ని లూయిస్ బర్గర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.