: యువతిని కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేసిన కర్నూలు అడిషనల్ ఎస్పీ కుమారుడు


తన తండ్రి చేతిలో అధికారం ఉందన్న అహంభావంతో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని కిడ్నాప్ చేయబోయి కటకటాలు లెక్కిస్తున్నాడో యువకుడు. ఈ ఘటన హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా సీఐడీ విభాగానికి చెందిన అదనపు ఎస్పీ శ్రీధర్ కుమారుడు శ్రీకాంత్ (26), తన స్నేహితులు వెంకటేష్, అరుణ్ లతో కలసి పూటుగా మద్యం సేవించాడు. 'పోలీస్' అని రాసున్న కారులో చక్కర్లు కొట్టడం ప్రారంభించారు. ఇదే సమయంలో వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ వివాహిత (28) అమీర్ పేటలోని ఓ కంపెనీలో విధులు ముగించుకుని, ఇంటికి వెళుతూ, మార్గమధ్యంలో స్నేహితురాలి కోసం దిల్ సుఖ్ నగర్ దగ్గర ఆగింది. ఆమెను చూసిన శ్రీకాంత్, తన మిత్రబృందంతో కలసి వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతంగా కారులోకి తోసి కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్పందించి అడ్డుకోబోయిన యువకుడిని చితకబాదారు. ఘటనను చూస్తున్న మరికొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చేలోగా, అరుణ్ పరారయ్యాడు. శ్రీకాంత్, వెంకటేష్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News