: ఇకపై కడపలో 5 నిమిషాలు ఆగనున్న 'హరిప్రియ'
తిరుపతి నుంచి కొల్హాపూర్ మధ్య నడిచే 'హరిప్రియ' ఎక్స్ ప్రెస్ రైలు ఇకపై కడపలో 5 నిమిషాల పాటు ఆగనుంది. ఈ మేరకు రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి ఈ రైలు కడపలో రెండు నిమిషాల పాటు మాత్రమే ఆగుతుంది. ఆ సమయంలో తమలపాకు, పండ్ల తోటల రైతులు తమ ఉత్పత్తులను రైల్లోకి ఎక్కించేందుకు ఇబ్బందులు పడుతుండేవారు. ఇదే విషయాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన విషయాన్ని వివరిస్తూ, గత నెలలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ భూపాల్ రాజుకు లేఖ రాశారు. రైలును మరింత సమయం పాటు నిలపాలని అవినాష్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన అధికారులు 'హరిప్రియ' ఎక్స్ ప్రెస్ ను ఐదు నిమిషాలు ఆపేందుకు నిర్ణయించారు.