: మహేష్ బాబు అభిమానిని...ఫిదా అయిపోయా: రాహుల్ రవీంద్రన్
తాను సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానినని టాలీవుడ్ వర్ధమాన నటుడు, అందాల రాక్షసి ఫేం రాహుల్ రవీంద్రన్ తెలిపాడు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన 'శ్రీమంతుడు' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, మహేష్ బాబును దగ్గర నుంచి చూస్తే బాగుంటుందని భావించేవాడినని, అలాంటి మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం త్వరగానే వచ్చిందని చెప్పాడు. ఎవరైనా నటిస్తే వాళ్లు నటిస్తున్నారన్న విషయం మనకు త్వరగా తెలిసిపోతుందని, మహేష్ బాబు విషయంలో మాత్రం దానిని పట్టుకోలేమని, చాలా రియలిస్టిక్ గా నటిస్తాడని అన్నాడు. పాత్రను సులభంగా చేసి చూపిస్తాడని, షూటింగ్ సెట్ లో ఆయన నటనను దగ్గరుండి చూడడం, ఆయన నటనను ఆస్వాదించడం గొప్ప అనుభూతి అని చెప్పాడు. స్పాట్ లో ఆయన నటనను చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని రాహుల్ తెలిపాడు. మహేష్ బాబు నటనకు ఫిదా అయిపోయానని చెప్పాడు. ఒక రాత్రి కొరటాల శివ ఫోన్ చేసి మహేష్ బాబు పక్కన ఓ పాత్ర ఉంది చేస్తారా? అని అడిగాడని, వెంటనే ఒకే చెప్పేశానని రాహుల్ వెల్లడించాడు.