: అందం, గుణం, అభిమానంలో 'శ్రీమంతుడు': సుధీర్ బాబు
'శ్రీమంతుడు' అంటే బీఎండబ్ల్యూ కారులో వస్తాడనుకుంటే సింపుల్ గా సైకిల్ మీద వచ్చేశాడని, అలా మహేష్ బాబును చూపించడానికి చాలా ధైర్యం కావాలని నటుడు సుధీర్ బాబు తెలిపాడు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, అభిమానుల్లో ఒకడిగా ఉండి మహేష్ బాబుకు సంబంధించిన ఏ విషయమైనా ఆస్వాదించేందుకు ఇష్టపడతానని చెప్పాడు. సాధారణంగా మనం ఉపయోగించే వస్తువుల వల్ల మనకి స్టేటస్ వస్తుంది. కానీ మహేష్ బాబు వాడే వస్తువులకే అతని వల్ల స్టేటస్ వస్తుందని తెలిపాడు. మహేష్ బాబు అందంలో, గుణంలో, అభిమానంలో 'శ్రీమంతుడ'ని అన్నాడు. సినిమా విడుదల అనంతరం సినిమా చరిత్ర రికార్డులన్నింటినీ దత్తత తీసుకుంటాడని సుధీర్ బాబు విశ్వాసం వ్యక్తం చేశాడు. 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' విజయవంతం చేసినందుకు అభిమానులకు ధన్యవాదాలని సుధీర్ బాబు చెప్పాడు.