: భారతీయ సినిమా కలెక్షన్స్ రికార్డులను తిరగరాసిన భజరంగీ భాయ్ జాన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగీ భాయ్ జాన్' భారతీయ సినిమా తొలి రోజు కలెక్షన్ల రికార్డులను చెరిపేసింది. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలలో 5000 థియేటర్లలో విడుదలైన 'భజరంగీ భాయ్ జాన్' తొలి రోజు 27 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈద్ ను పురస్కరించుకుని శుక్రవారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు వారాంతం శని, ఆది వారాల్లో స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది. దీంతో భారతీయ సినిమా కలెక్షన్ల రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. 'భజరంగీ భాయ్ జాన్' సినిమాను మానవత్వాన్ని పరిమళించిన సినిమాగా క్రిటిక్స్ అభివర్ణిస్తున్నారు. అభిమానులు సల్మాన్ ను కొత్తగా చూపించారని, సల్లూభాయ్ కూడా తన నటనా కౌశలంతో సినిమాను రక్తికట్టించారని పేర్కొంటున్నారు. మాస్ హీరో ఇమేజ్ కు భిన్నంగా సల్లూ భాయ్ చేసిన ఈ ప్రయత్నాన్ని నెటిజన్లు 'బీయింగ్ హ్యూమన్' అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. సల్మాన్ ఖాన్ 'బీయింగ్ హ్యూమన్' ట్రస్ట్ పేరిట సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తాడనే విషయం తెలిసిందే.