: రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి సానియా పేరు?
హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్ ఖేల్ రత్న' ఇవ్వాలంటూ క్రీడల మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫారసు చేయనున్నట్టు తెలిసింది. కెరీర్లో అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్న సానియా ఇటీవలే మార్టినా హింగిస్ జతగా వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ గెలిచింది. గతకొంతకాలంగా సానియా టాప్ ర్యాంకులో కొనసాగుతోంది. వివిధ వేదికలపై సాధించిన విజయాలతో సానియా పేరుప్రతిష్ఠలు ఇనుమడించాయి. కాగా, ఖేల్ రత్నకు సానియా వ్యక్తిగతంగా దరఖాస్తు చేయలేదు. అయితే, ఓ అథ్లెట్ కు ఆ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకునే అర్హత ఉందని క్రీడల శాఖ భావిస్తే, సదరు మంత్రిత్వ శాఖే స్వయంగా కేంద్రానికి సిఫారసు చేయవచ్చు. ఈ ఏడాది సానియా సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుని ఆమె పేరును క్రీడల శాఖ కేంద్రానికి సిఫారసు చేయవచ్చని భారత క్రీడావర్గాలు అంటున్నాయి. సానియా 2004లో అర్జున అవార్డు, 2006లో పద్మశ్రీ అందుకున్నది.