: టోల్ ప్లాజాల్లో రుసుము వసూలు నిలిపివేత... చంద్రబాబు ఆదేశం
గోదావరి పుష్కరాలకు భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. హైదరాబాదు-విజయవాడ, విజయవాడ-రాజమండ్రి, హైదరాబాదు-వరంగల్, హైదరాబాదు- బాసర తదితర రూట్లలో రద్దీ వాతావరణం నెలకొంది. ఉభయ గోదావరి జిల్లాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంది. దీంతో ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ గేట్ల వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గంటల తరబడి భక్తులు రోడ్డపైనే చిక్కుకుపోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిపై సమాచారం అందుకున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు టోల్ రుసుమును నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో ఉభయగోదావరి జిల్లాల్లోని టోల్ ప్లాజాల్లో రుసుము వసూళ్లను అధికారులు నిలిపేశారు.