: మెమన్ కంటే ముందు రాజీవ్ హంతకులను ఉరి తీయండి: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్
ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్ కంటే ముందు మాజీ ప్రదాని రాజీవ్ గాంధీ హంతకులను ఉరి తీయాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా నిన్న మక్కా మసీదులో మజ్లిస్ పార్టీ ఏర్పాటు చేసిన ‘జల్సే యౌముల్ ఖురాన్’ కార్యక్రమంలో ఒవైసీ మాట్లాడుతూ పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ ను హత్య చేసిన వారిని కూడా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. హైదరాబాదు మక్కా మసీదుతో పాటు సంఝౌతా ఎక్స్ ప్రెస్, అజ్మీర్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డ నిందితులను కూడా ఉరి తీయాలని ఆయన అన్నారు. ముషీరాబాదులో ఎన్నారైలపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, విచారణ కోసం హైదరాబాదు తీసుకొస్తున్న వికారుద్దీన్ గ్యాంగ్ ను బూటకపు ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఒవైసీ ఆరోపించారు.