: క్లబ్బులో బీరు తాగి హంగామా చేసిన ఉడుత
యూకేలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. క్లబ్బులో ప్రవేశించిన ఉడుత అక్కడ మద్యం తాగి నానా హంగామా చేసింది. వివరాల్లోకెళితే... వర్సెస్టర్ షైర్ లోని ఈవ్ షామ్ వద్ద హనీబోర్న్ రైల్వే క్లబ్ లో ప్రవేశించిన ఉడుత బీరు కుళాయి తిప్పి కడుపునిండా తాగింది. ఆ తర్వాత కిక్కు తలకెక్కడంతో అక్కడి బాటిళ్లపైనా, గ్లాసులపైనా తన ప్రతాపం చూపింది. వాటిపై ఇష్టం వచ్చినట్టు తిరగడంతో అవన్నీ పగిలిపోయాయి. విలువైన మద్యం నేలపాలైంది. క్లబ్ లోపల చిందరవందరగా ఉండడం చూసిన క్లబ్ సెక్రటరీ శామ్ బౌల్టర్ ఎవరో వ్యక్తులు ప్రవేశించి ఉంటారని భావించాడు. ఇంతలో ఓ బాక్సు పక్క నుంచి ఉడుత తూగుతూ బయటికి రావడంతో, అంతా దాని పనే అని నిర్ధారించుకున్నాడు. దాన్ని ఓ డస్ట్ బిన్ లో వేసి, కిటికీలోంచి బయటికి వదిలేశాడు. ఆ ఉడుత మద్యపానం కారణంగా దాదాపు 300 పౌండ్ల మేర నష్టం వాటిల్లినట్టు బౌల్టర్ తెలిపాడు.