: మోదీ ఛాతిని తగ్గిస్తా: రాహుల్ గాందీ
ప్రధాని మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల ఉద్ధృతిని పెంచారు. పదవి చేపట్టిన తరువాత ప్రజలను మర్చిపోయిన ప్రధాని మోదీ ఛాతిని తగ్గిస్తానని రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, భూసేకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. భూసేకరణ బిల్లులో సవరణలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో చూస్తారని ఆయన అన్నారు. ఎన్నికల సందర్భంలో దేశాన్ని నడిపించడానికి 56 అంగుళాల ఛాతి ఉన్నవాడు కావాలని మోదీ అన్నారని గుర్తు చేసిన రాహుల్, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు తెరతీస్తున్నందున, మరో ఆరు నెలల్లో ఆ ఛాతిని 5.6 అంగుళాలకు తగ్గిస్తామని అన్నారు. ప్రజల హక్కులను కాలరాసే ఏ బిల్లునైనా తాము వ్యతిరేకిస్తామని రాహుల్ స్పష్టం చేశారు.