: దూకుడు పెంచిన రాహుల్... 'రాజస్థాన్' రిమోట్ లండన్ లో ఉందంటూ సెటైర్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రంపైనా, రాజస్థాన్ సర్కారుపైనా దాడుల తీవ్రత పెంచారు. రాజస్థాన్ సర్కారు రిమోట్ లండన్ లో ఉందంటూ సీఎం వసుంధరా రాజేను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్య చేశారు. ఐపీఎల్ కళంకితుడు లలిత్ మోదీ లండన్ లో ఉంటూ ఇక్కడి పాలనను నిర్దేశిస్తున్నారని ఆరోపించారు. ఐపీఎల్ లో అవినీతికి పాల్పడ్డాడంటూ లలిత్ మోదీపై ఆరోపణలున్నాయని, అలాంటి వ్యక్తికి రాజే సాయం చేశారని మండిపడ్డారు. వసుంధరా రాజే తనయుడి కంపెనీలో లలిత్ మోదీ భారీగా పెట్టుబడులు పెట్టినట్టు కథనాలు రావడం తెలిసిందే. అంతేగాదు, సీఎం రాజేకు కూడా ఆయన బాగా సన్నిహితుడని ప్రచారంలో ఉంది! కాగా, రాహుల్ ప్రస్తుతం రాజస్థాన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. అటు, ప్రధాని మోదీపైనా ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా మోదీ సర్కారు అమలు చేయలేదని అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో చోటుచేసుకున్న అవినీతిపై మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.